కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో తెలంగాణకు చెందిన ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి గోపీచంద్, పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. గాయత్రితో పాటు ఆమె సహచర క్రీడాకారిణి ట్రీసా జాలీకి కూడా ఈ అవార్డు దక్కింది.

అంతర్జాతీయ పారా షూటింగ్‌లో పతకాలు సాధించిన ధనుష్ శ్రీకాంత్‌తో పాటు, మరో పారా షూటర్ రుద్రాంశ్ ఖండేల్వాల్‌ను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. చెస్ క్రీడలో రాణిస్తున్న దివ్యా దేశ్‌ముఖ్, విదిత్ సంతోష్ గుజరాతీలకు కూడా అర్జున అవార్డులు లభించాయి. అథ్లెటిక్స్‌లో తేజస్విన్ శంకర్, మహ్మద్ అజ్మల్, ప్రియాకం గోస్వామిలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

వీరితో పాటు బాక్సింగ్‌లో నరేందర్ బెర్వాల్, హాకీలో లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్, కబడ్డీలో సుర్జీత్, పూజలకు అవార్డులు దక్కాయి. పారా అథ్లెటిక్స్‌లో ఏక్తా బ్యాన్, రోయింగ్‌లో అరవింద్ సింగ్, షూటింగ్‌లో అఖిల్ షియోరాన్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 17 మంది క్రీడాకారులకు ఈసారి అర్జున అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.

క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయలేదు. కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డులను ముగ్గురికి, లైఫ్‌టైం కేటగిరీలో ఇద్దరికి ప్రభుత్వం అందించింది. అర్జున అవార్డు (లైఫ్ టైమ్)ను ఫుట్‌బాల్ క్రీడాకారుడు అరుమై నాయగం దక్కించుకున్నారు.

అవార్డులు పొందిన తెలంగాణ క్రీడాకారులు గాయత్రి, ధనుష్‌లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వీరి ప్రతిభ యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర క్రీడాకారులు ఈ ఘనత సాధించడం గర్వకారణమని తెలిపారు.