ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి ఒకప్పుడు సుమారు 230 కిలోల బరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిలబడటం, నడవడం కూడా కష్టంగా మారడంతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితి ప్రాణాంతకమని, తాను బతకడానికి కేవలం ఆరు నెలలు మాత్రమే ఉండవచ్చని వైద్యులు హెచ్చరించారు.
వైద్యుల హెచ్చరిక విన్న తన తండ్రి కళ్లలో కనిపించిన భయం, ఆందోళన అద్నాన్‌ను తీవ్రంగా కలచివేశాయి. ఆ సమయంలో తండ్రికి తాను బరువు తగ్గుతానని మాట ఇచ్చారు. ఆ వాగ్దానమే తన బరువు తగ్గే ప్రయాణానికి అసలు ప్రారంభమని ఆయన ఇటీవల జూమ్ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా తాను ఎలాంటి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోలేదని అద్నాన్ స్పష్టం చేశారు. కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామం, నిపుణుల పర్యవేక్షణతోనే ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు. వారం మొత్తం కష్టపడినా కేవలం అర కిలో మాత్రమే తగ్గిన సందర్భాలు ఉన్నా, నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగించానని ఆయన వివరించారు.
చివరకు అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం, క్రమశిక్షణతో కూడిన వ్యాయామంతో అద్నాన్ తన బరువును 120 కిలోలకు తగ్గించుకున్నారు. అంటే మొత్తం 110 కిలోల బరువును ఆయన తగ్గారు. 2016లో భారత పౌరసత్వం పొందిన అద్నాన్ సమి, 2020లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.








