నక్సల్స్ ఉగ్రవాదులతో నిండిన దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం, గచ్చిబౌలిలో భూములు స్వాధీనం చేసుకోవడం లాంటి సులభమైన పని కాదని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. తన భద్రతను తొలగించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బుధవారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో మండే ఎండల్లో, నీళ్లు దొరకని పరిస్థితుల్లో ప్రాణాలు నిలుపుకోవడానికి తమ మూత్రాన్నే తాగుకుని బతికిన రోజులు ఉన్నాయని ఆయన ఆవేదన చెందారు.
వర్షం పడుతున్నప్పుడు గొడుగు అవసరమని, వర్షం ఆగి ఎండ వచ్చాక అదే గొడుగు భారంగా మారుతుందని ఆయన ఉదహరించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన మాజీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీలకు ఎండలోని గొడుగుల్లా కనిపిస్తున్నారని విమర్శించారు. తనపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే వందలాది మంది పోలీస్ అధికారుల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల విలాసాల కోసం, ర్యాలీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అలాంటిది దేశ రక్షణ కోసం పోరాడిన అధికారుల భద్రత ఖర్చు ఎంత అని ప్రశ్నించారు. బలిమెలలో 40 మంది కమాండోలు వీరమరణం పొందిన సమయంలో కూడా నాటి ముఖ్యమంత్రులు కుటుంబాలను పరామర్శించలేకపోయారని, తమను పంపించారని గుర్తుచేశారు. రాత్రనకా పగలనకా దండకారణ్యంలో తిరిగి శాంతిభద్రతలు కాపాడినా, తమ జీతం ఒక పైసా పెరగలేదని, గజం భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు.
కోర్టుల్లో ప్రభుత్వ లాయర్లు తమ పిటిషన్లకు వ్యతిరేకంగా వాదించే తీరు చూస్తుంటే, ప్రభుత్వానికి తమపై ఎంత అసహ్యం, వివక్ష ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దురదృష్టమని, 30 ఏండ్ల క్రితమే ఇది తెలిసి ఉంటే ఐపీఎస్‌లో చేరేవాడిని కాదేమోనని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఏ ప్రమాదం జరిగినా సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.








