న్యూజెర్సీలోని ఏపీఏ (APA) హోటల్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో జూలై 12, 2026న ఈ కార్యక్రమం జరిగింది. 'షైనింగ్ ఏ లైట్ ఆన్ లిబర్టీ అండ్ ఇంక్లూజన్' అనే ఇతివృత్తంతో ఆటిజంపై అవగాహన కల్పించడం, మద్దతు తెలపడం ఈ వేడుక ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సభ్యుడు ఫ్రాంక్ పల్లోన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుధీర్ పారిఖ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏమిటో డాక్టర్ బిమల్ రమాని వివరించారు. ఆటిజంతో బాధపడుతున్న వారికి తోడ్పాటు అందించే ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య ప్రదర్శనలు, ఆటిజంపై ఒక లఘు నాటికను ప్రదర్శించారు. జాక్ లోరీ బ్యాండ్, జిప్సీ ఫంక్ స్క్వాడ్ బృందాల సంగీత విభావరితో వేడుకలు కొనసాగాయి. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను, ఆటిజం పట్ల సామాజిక బాధ్యతను ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు.







