ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో, నాన్‌వెజ్ ప్రియులకు చికెన్, మటన్ వంటి ప్రోటీన్ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయితే, శాకాహారులకు పనీర్, సోయా చంక్స్ (మీల్ మేకర్) మాత్రమే అధిక ప్రోటీన్‌ను అందిస్తాయి. సరైన పద్ధతిలో వండితే మీల్ మేకర్ మసాలా కర్రీ మటన్‌ను మించే రుచిని ఇస్తుందని చాలా మందికి తెలియదు.
ముందుగా ఒక మిక్సీ జార్‌లో మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, ఆరు జీడిపప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ గరం మసాలా, ఒక టీస్పూన్ చికెన్ మసాలా, పావు టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సిద్ధం చేసుకున్న పేస్ట్, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపాలి.
ఇప్పుడు 50 గ్రాముల మీల్ మేకర్‌ను పది నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి, నీటిని పూర్తిగా పిండేయాలి. వీటిని మసాలా మిశ్రమంలో వేసి బాగా పట్టించాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ వేయించాలి. రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు చేర్చి వేయించాలి.
మ్యారినేట్ చేసిన మీల్ మేకర్‌ను పాన్‌లో వేసి మీడియం మంటపై నాలుగు నిమిషాలు వేయించాలి. మసాలా నుండి నూనె విడిపోయిన తర్వాత పావు గ్లాసు నీళ్లు పోసి, మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర, పావు టీస్పూన్ మిరియాల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే రుచికరమైన మీల్ మేకర్ మసాలా కర్రీ సిద్ధమవుతుంది.








