– నిందితుడి అరెస్టు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం – కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం, జూన్ 23 : అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఇనగంటి నాగరాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మంగళవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంబేద్కర్‌నగర్‌కు చెందిన సాధన శివాజీ భార్యను నాగరాజు వెంటపడి వేధిస్తున్నాడని ఆమె తన భర్తకు తెలిపింది. ఈ నేపథ్యంలో శివాజీ, అతని భార్య నాగేశ్వరి, చెల్లెలు పరిశుద్ధ అలియాస్ ప్రమీల కలిసి నాగరాజును హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ రాత్రి సుమారు 10.20 గంటలకు శివాజీ నాగరాజు ఇంటికి వెళ్లి, ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజుపై కత్తితో దాడి చేసి హత్య చేసి పరారైనట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడు తన ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో వన్‌టౌన్ సీఐ ఎం.కరుణాకర్ సిబ్బందితో కలిసి శివాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఘటన సమయంలో ధరించిన టీ-షర్టును స్వాధీనం చేసుకున్నామని, అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ సీఐ కరుణాకర్, టూ టౌన్ ఎస్‌ఐలు రాజశేఖర్, జీవన్‌రాజ్ పాల్గొన్నారు.








