మాడు పగిలేలా ఎండ .. శరీరం మొత్తం చెమటతో తడిసిపోతుంటే, రాజ్‌వీర్ ఇంకా బనార్‌ ప్రాణాలకు తెగించి నదిలో నాణేలు ఏరే పనికి సిద్ధమయ్యారు. వారు దిగేది నీటిలో కాదు… కాలుష్యంతో విషంగా మారిన యమునా నదిలోకి.

కుటుంబాన్ని పోషించే బాధ్యత వారిని ప్రతిరోజూ ఈ ప్రమాదకర పనిలోకి నెడుతోంది. వారితో పాటు పెంపుడు కుక్క కూడా ఆ విషపూరిత జలాల్లో ఈదుతూ కనిపిస్తుంది. ఒడ్డున ఎవరో వారి రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు.

ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఒకప్పుడు ఢిల్లీకి జీవనాధారంగా ఉన్న తాజ్‌మహల్‌ సాక్షిగా ప్రవహించే యమునా నది… ఇప్పుడు మురుగు నీటి కాలువగా మారింది. పరిశ్రమల వ్యర్థాలు, భారీ లోహాలతో విషపూరితంగా మారింది.

దాన్ని నది అనడం కంటే కెమికల్ డంపింగ్ యార్డ్‌ అనడం కరెక్ట్‌. విషజలాల వల్ల రాజ్‌వీర్, బనార్‌ ఇద్దరూ చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం కూడా వీరిని వెంటాడుతోంది.

పాలకుల నిర్లక్ష్యం, పేదరికం యమున కాయిన్ డైవర్ల జీవితాలను నదిలోని విష రసాయనాల కంటే దారుణంగా మార్చేస్తున్నాయి. నదిలోకి దూకి అడుగున పూడుకుపోయిన నాణేలు, స్క్రాప్ మెటల్‌ కోసం వారు మృత్యుపోరాటం సాగిస్తున్నారు. ఆ విషపు నీటి అడుగున ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా, తమ ఆకలి తీరకపోతుందా అనే ఆశతో రాజ్‌వీర్ సింగ్, బనర్ సింగ్ ప్రతిరోజూ నది లోతుల్లోకి వెళుతున్నారు.

కేవలం ఒక గుటక మంచి నీరు తాగి, మళ్లీ నల్లటి నీటిలోకి దూకడానికి సిద్ధమవుతున్నారు. గత నలభై ఏళ్లుగా అదే పని చేస్తున్నానని రాజ్‌వీర్ సింగ్ తెలిపాడు. భక్తులు విసిరే నాణేల కోసం మాత్రమే కాదు నది అడుగున బురదలో కూరుకుపోయిన పాత ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ సీసాలు..

గుజరీ మార్కెట్‌లో అమ్ముడుపోయే ఏ వస్తువు దొరికినా ఏరుతారు. అంత ప్రాణాంతకమైన పని చేస్తే వారికి రోజుకు సగటున లభించే కూలి కేవలం 600 రూపాయలే. యమున తల్లి లాంటిది, ఇన్నేళ్లుగా ఆమె తమకు అన్నం పెడుతోందని బనార్ సింగ్ చెప్పాడు.

తన చేతులపై ఉన్న నల్లటి, గరుకైన చర్మం నదిలోని రసాయనాల వల్లే వచ్చిందని తన చేతులను చూపిస్తూ దశాబ్దాలుగా నదిలో గడపడం వల్ల తన శరీరానికి జరిగిన నష్టాన్ని బనార్ సింగ్ వివరించాడు. 40 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో నిలబడి, ఆపై పారిశ్రామిక రసాయనాల కాక్‌టెయిల్‌లా మారిన నదిలోకి దూకడం వారి దారుణమైన మనుగడకు అద్దం పడుతోంది. జీవితం ఒక నిరంతర పోరాటంగా మారినప్పటికీ, కుటుంబాలను పోషించడానికి, ఆకలి తీర్చుకోవడానికి రాజ్‌వీర్, బనార్‌లకు ఈ ప్రమాదకరమైన పనే శరణ్యమైంది.

ప్రాణాలు పోతాయని తెలిసినా, ఆకలి ముందు ఆ భయం ఓడిపోతోందనే నిజానికి వీరి జీవితాలే సాక్ష్యం.