రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం కన్నుల పండువలా సాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు మంగళవారంనాడు పద్మ అవార్డులు అందజేశారు. ఈ విడతలో మొత్తం 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టి, అల్కా యగ్నిక్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్, సాహిత్యం, విద్యారంగంలో విశేష కృషి చేసిన మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్‌కు పద్మభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడుకు కూడా పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.
టెన్నిస్ ప్లేయర్ విజయ్ అమృత్‌రాజ్, పారిశ్రామికవేత్త ఎస్‌కెఎం మైలనందన్, సామాజిక కార్యకర్త వెల్లపల్లి నటేషన్, శిబూ సోరెన్ భార్య రూపి సోరెన్ కూడా పద్మ భూషణ్ అవార్డును రాష్ట్రపతి అందజేశారు. క్రికెటర్ రోహిత్ శర్మ పదశ్మీ అవార్డు అందుకున్నారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌తో పాటు నటుడు ఆర్. మాధవన్, ప్రముఖ సైంటిస్టు జి.చంద్రమోళి తదితరులు పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.








