లక్నో: అయోధ్య రామాలయ విరాళాలు దుర్వినియోగమయ్యాయని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) తన ప్రాథమిక నివేదికను యుపి ప్రభుత్వానికి మంగళవారం సమర్పించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ నివేదికను అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) సంజయ్ ప్రసాద్‌కు సమర్పించారు. తదుపరి వాస్తవాల సేకరణకు సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. రానున్న పది, పదిహేను రోజుల్లో తుది నివేదిక సమర్పిస్తామని పంత్ వెల్లడించారు.
రామాలయానికి వచ్చిన కోట్లాది రూపాయల విరాళాలు దుర్వినియోగమయ్యాయని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ జూన్ 4న కొన్ని సాక్షాలతో ఆరోపించారు. కోర్టులు తమ పరిగణనలోకి ఈ వ్యవహారాన్ని తీసుకుని దర్యాప్తు చేయాలని అభ్యర్థించారు. దీనిపై దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న సిట్ ఏర్పాటు చేసింది.








