వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో పంట మార్పిడి కీలకమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రతి గ్రామంలో పోషక విలువలున్న పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఎడ్జర్ల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటిని వినియోగించే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.
రైతులు తమ భూమిని వివిధ భాగాలుగా విభజించి, ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని ఆమె వివరించారు. యూరియా, పురుగుమందుల అధిక వినియోగం వల్ల ఆహారంలో పోషక విలువలు తగ్గడమే కాకుండా, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనాల వాడకాన్ని తగ్గించి పండించే ఉత్పత్తులకు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఐసీఏఆర్ (ICAR)–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, బెంగళూరు అభివృద్ధి చేసిన 'అర్క తేజస్వి' మిరప విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ రకం మిరప విత్తనాలు నల్ల తామర తెగులును తట్టుకోవడమే కాకుండా, ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తాయని అధికారులు తెలిపారు. శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.








