రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి నటరాజన్, మంత్రి కొండా సురేఖతో పాటు లోక్‌సభ సభ్యురాలు కడియం కావ్యతోనీ వేర్వేరుగా సమావేశమయ్యారు. తొలుత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి కాన్ఫరెన్స్ చేసిన మీనాక్షి, తర్వాత స్వయంగా వచ్చిన మంత్రితో మాట్లాడారు.
ఈ భేటీలో కడియం శ్రీహరి ప్రవర్తనపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తుంటే మౌనంగా ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల దేవాదాయ శాఖ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సమీక్షా సమావేశం నిర్వహించడం, జిల్లాలో తనకు వ్యతిరేకంగా మాట్లాడటం వంటి అంశాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సంయమనం పాటించాలని, చిన్న విషయాలను పట్టించుకోవద్దని మీనాక్షి సూచించినా మంత్రి సంతృప్తి చెందలేదని తెలిసింది.
మరోవైపు కడియం శ్రీహరి కుమార్తె, ఎంపీ కడియం కావ్యతోనూ మీనాక్షి నటరాజన్ చర్చించారు. ఇరువురి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తుతున్నాయని, ఇలా కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని, ప్రతిపక్షాలకు అవకాశం దక్కుతుందని ఆమె ఎంపీతో అన్నారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎంపీ కావ్య ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. ఇరువురి మధ్య వివాదాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు మీనాక్షి ఇదివరకే ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్‌ను నియమించారు.
సచిన్ సావంత్ ఇచ్చిన వివరాల మేరకు మీనాక్షి సచివాలయంలోనూ కొంత సేపు చర్చలు జరిపారు. తాను కడియం శ్రీహరితోనూ చర్చించి ఈ వివాదాన్ని పరిష్కరిస్తానని మంత్రికి హామీ ఇచ్చారు. దీంతో ఈ రాజకీయ వివాదానికి పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.







