తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.
ఈ పర్యటనలో ఎంపీ చిన్నితో పాటు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. స్థానికుల ఇళ్లకు వెళ్లిన నేతలు, వారి సమస్యలను, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే, ప్రజల నుంచి సూచనలను సేకరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీ చిన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం మరింత పెంచుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఎంపీ చిన్ని సూచించారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








