పాట్నా, ఆంధ్రప్రభ : దేశంలో పోటీ పరీక్షల నిర్వహణ, పేపర్‌ లీకేజీలపై యువత ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతుంది. బీహార్‌లో మరోసారి విద్యార్థుల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. 70వ బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రాథమిక పరీక్షలో పేపర్‌ లీక్‌, ఇతర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ… వేలాది మంది అభ్యర్థులు పాట్నా వీధుల్లోకి వచ్చారు. గార్దనీబాగ్‌లో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న నిరసనలకు మరింత ఊపు వచ్చింది.

గాంధీ మైదాన్‌ నుంచి రాజ్‌భవన్‌ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు పోలీసు బారికేడ్లను తొలగించి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్ క్యానన్స్ ప్రయోగించగా, పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

70వ బీపీఎస్సీ ప్రాథమిక పరీక్షను పూర్తిగా రద్దు చేసి, స్వతంత్ర విచారణ అనంతరం కొత్తగా పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని, సామాజిక మాధ్యమాల్లో ప్ర‌శ్నాప‌త్రాలు లీక్ అయ్యాయ‌ని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమ జీవితాలు, భవిష్యత్తుతో అధికారులు ఆటలాడుతున్నారని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాంధీ మైదాన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు భారీ మార్చ్‌

ఆందోళనలో భాగంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాంధీ మైదాన్‌లో చేరి అక్కడి నుంచి రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాసం వైపు కదిలారు. ముందుగానే భారీగా పోలీసు బలగాలను మోహరించిన అధికారులు పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే నిరసనకారులు బారికేడ్లను తొలగించి ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు జలఫిరంగులను ఉపయోగించారు. అయినప్పటికీ పలువురు విద్యార్థులు తమ డిమాండ్లకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. దాదాపు 1,799 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన పరీక్షపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున, మొత్తం ప్రక్రియపై పారదర్శక విచారణ జరపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అవసరమైతే ఒకటి లేదా రెండు నెలల్లో కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు.