వర్షాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల బట్టలు సరిగ్గా ఆరక బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి దుర్వాసన వస్తుంటాయి. కాటన్, సిల్క్ దుస్తులతో పాటు అల్మారాలో మడతపెట్టిన బట్టలకు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ దుర్వాసనను సులభంగా వదిలించుకోవచ్చు.
బట్టలు ఉతికేటప్పుడు చివరిసారి నీటిలో అర కప్పు వైట్ వెనిగర్ లేదా ఒకటి, రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపితే దుర్వాసన తగ్గుతుంది. అయితే ఈ రెండింటిని ఒకేసారి కాకుండా విడివిడిగా వాడటం మంచిది. అలాగే కాటన్ బట్టలపై స్వల్పంగా తేమ ఉన్నప్పుడు పలుచని వస్త్రాన్ని ఉంచి తక్కువ వేడితో ఐరన్ చేస్తే తేమ ఆవిరై బట్టలు త్వరగా ఆరుతాయి. సిల్క్ దుస్తుల విషయంలో మాత్రం ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.
లావెండర్, రోజ్ లేదా లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్‌లో ఐదు చుక్కలను ఒక కప్పు నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. బట్టలు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు దూరం నుంచి వీటిని స్ప్రే చేయవచ్చు. అయితే ముందుగా దుస్తులపై చిన్న భాగంలో పరీక్షించడం ఉత్తమం. అల్మారాలో కర్పూరం, లవంగాలు, వామును చిన్న మూటగా కట్టి ఉంచడం వల్ల గదిలో తాజా వాసన ఉంటుంది.
అల్మారాలో నాఫ్తలీన్ బాల్స్ లేదా కర్పూరం ఉంచేటప్పుడు అవి బట్టలకు నేరుగా తగలకుండా చిన్న పొట్లాల్లో వేసి మూలల్లో ఉంచాలి. నాఫ్తలీన్ బాల్స్ వాడేటప్పుడు పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం తప్పనిసరి. ఫ్యాబ్రిక్ కండిషనర్ వాడేటప్పుడు సిల్క్ వంటి సున్నితమైన వస్త్రాల లేబుల్ సూచనలను తప్పక పరిశీలించాలి. గదిలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం కూడా దుర్వాసన నివారణకు కీలకం.








