జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో రికార్డులు సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హరారే స్టేడియం అతడికి బాగా కలిసివచ్చింది. గతంలో ఇదే మైదానంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించి, బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా తీసి భారత్‌ను విజేతగా నిలిపాడు.
ఈ ప్రదర్శనతో వైభవ్‌ను టీమిండియా భవిష్యత్తు ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే అవకాశాలపై చర్చ మొదలైంది. భారత జట్టు తాత్కాలిక స్పిన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి దీనిపై స్పందిస్తూ, 15 ఏళ్ల కుర్రాడి విషయంలో తొందరపడకుండా నిదానంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
టీ20 ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్లు జట్టుకు ఎంతో ప్రయోజనకరమని టీమిండియా భావిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఆల్‌రౌండర్లపై ప్రత్యేక ఆసక్తి ఉంది. ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మలతో పాటు వైభవ్ కూడా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. ఈ యువ బ్యాటర్లు బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తే, రింకూ సింగ్ వంటి ఫినిషర్లకు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం పెరుగుతుంది.
వైభవ్ బౌలింగ్ నైపుణ్యాలపై పని చేసేందుకు టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమయం దొరికినప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో అతడి బౌలింగ్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తామని సునీల్ జోషి వెల్లడించారు.








