సివిల్ సర్వీసెస్ పరీక్షకు అనన్య రెడ్డి దాదాపు రెండేళ్ల పాటు సిద్ధమయ్యారు. రోజుకు ఎన్ని గంటలు చదవాలనే దానికంటే, ఆ రోజు పూర్తి చేయాల్సిన సిలబస్ మీద ఆమె దృష్టి పెట్టేవారు. సాధారణంగా ఆమె చదువు రోజుకు 14 గంటలు దాటేది కాదు. 18, 19 గంటలు చదవడం సాధ్యం కాదని, అంతసేపు చదివినా విషయాలను సరిగ్గా గ్రహించలేమని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు కొత్తగా రావడంతో, టాపర్లు సూచించిన దానికంటే ఎక్కువ వనరులను ఆమె చదివారు. ఎక్కువ మెటీరియల్ చదివినా రివిజన్ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. మెయిన్స్ పరీక్ష కోసం మాత్రం వ్యూహం మార్చి, పరిమితమైన మెటీరియల్‌ను పదేపదే రివైజ్ చేస్తూ విశ్లేషణాత్మక సమాధానాలు రాయడంపై దృష్టి పెట్టారు.

ఇంటర్వ్యూ దశలో నిజాయితీగా ఉండటమే ముఖ్యమని అనన్య భావించారు. తెలియని విషయాన్ని తెలియదని చెప్పడం, తెలిసిన విషయాన్ని మాత్రమే చెప్పడం ద్వారా ప్యానెల్ సభ్యుల అంచనాలను అందుకోగలిగారు. ఇంటర్వ్యూకు ముందు తన డీఏఎఫ్ (DAF - అభ్యర్థి వివరాలతో కూడిన పత్రం), హాబీలు, గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులపై ఆమె క్షుణ్ణంగా సిద్ధమయ్యారు.

జనరల్ స్టడీస్‌కు ఎటువంటి కోచింగ్ తీసుకోని అనన్య, ఆంత్రోపాలజీ సబ్జెక్టు కోసం మాత్రం Vaid’s ICS సంస్థ నుంచి మూడు నెలల ఆన్‌లైన్ శిక్షణ పొందారు. ఆంత్రోపాలజీలో ఫిజికల్, సోషల్, ట్రైబల్ విభాగాలకు అనుగుణంగా డయాగ్రామ్‌లు, థింకర్స్, కేస్ స్టడీలను ఉపయోగించి సమాధానాలు రాశారు. సివిల్స్‌లో కోచింగ్ తప్పనిసరి కాదని, పరీక్ష డిమాండ్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆమె తెలిపారు.

ప్రజలకు చేరువైన పరిపాలన అందించడమే తన ప్రధాన లక్ష్యమని అనన్య రెడ్డి చెప్పారు. ప్రజలు భయం లేకుండా అధికారులను సంప్రదించేలా, సులభమైన పరిపాలన అందించాలని ఆమె ఆకాంక్షించారు. తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ వస్తుందని తాను ఊహించలేదని, ఫలితాల్లో తన పేరు ఉంటే చాలనుకున్నానని ఆమె పేర్కొన్నారు.