సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకుల మధ్య ప్రత్యేక గ్రూపులు ఉంటాయనే ప్రచారంపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, వ్యక్తుల మధ్య ఏర్పడే మంచి అనుబంధమే ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని కోసం ఎలాంటి అగ్రిమెంట్లు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తమ కుటుంబానికి ఉన్న బంధం గురించి నాగవంశీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన బాబాయి చిన్నబాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. 'జులాయి' సినిమాతో మొదలైన ఈ ప్రయాణం, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పేరు, లోగో రూపకల్పన వరకు కొనసాగిందని ఆయన వివరించారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్‌కు వాటా ఉందనే ప్రచారంపై నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఆ బ్యానర్‌లో ఆయనకు ఎలాంటి షేర్ లేదని, కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారని ఆయన తెలిపారు. త్రివిక్రమ్ వాటా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఉంటుందని, అలాగే సితార, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ప్రాజెక్టుల్లో ఆయన స్క్రిప్టులు, ఇతర విషయాల్లో కీలక సలహాలు ఇస్తుంటారని నాగవంశీ వెల్లడించారు.
త్రివిక్రమ్ తమ బ్యానర్‌లోనే వరుసగా సినిమాలు చేస్తుండటంతో, ఆయనకు ఎక్స్‌క్లూజివిటీ ఇవ్వడం సహజమని నాగవంశీ అభిప్రాయపడ్డారు. సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ అనుబంధం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదని, ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.







