రోడ్డు భద్రతను పెంచేందుకు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. వాహనదారులు చేసే ప్రతి తప్పుకు కొన్ని నెగెటివ్ పాయింట్లను కేటాయించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పాయింట్లు నిర్ణీత స్థాయికి చేరుకుంటే, సంబంధిత డ్రైవర్ల లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది.

మరోవైపు, ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను బైక్ ట్యాక్సీలుగా నడుపుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్కరీ సూచించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అదనపు ఆదాయం లభిస్తుందని, దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా దీనిని పరిశీలించాలని ఆయన కోరారు.

అయితే, రవాణా అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో, బైక్ ట్యాక్సీలకు అనుమతులు ఇవ్వాలా వద్దా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కేంద్ర మంత్రి సూచన చేసినంత మాత్రాన దేశవ్యాప్తంగా వెంటనే బైక్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయని భావించకూడదని గడ్కరీ స్పష్టం చేశారు. ఈ సేవలకు సంబంధించిన బీమా, ఇతర నిబంధనలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలే ఖరారు చేయాల్సి ఉంటుంది.

డ్రైవర్ల ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు 'సురక్ష' అనే కొత్త కార్యక్రమాన్ని గడ్కరీ ప్రారంభించారు. డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, మైనింగ్ ప్రాజెక్టుల సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. తొలి దశలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్-కాంప్టీ NH-44 మార్గంలో 150 కిలోమీటర్ల పరిధిలో, అలాగే చంద్రపూర్ మైనింగ్ ప్రాంతాల్లో 10 వేల మందికి సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రోడ్డు భద్రతలో డ్రైవర్ల కంటి చూపు పరీక్షలు చాలా కీలకమని మంత్రి నొక్కి చెప్పారు. భారీ వాహనాలు, నిర్మాణ పరికరాలు నడిపే డ్రైవర్లకు సరైన శిక్షణ ఇచ్చే వ్యవస్థ ప్రస్తుతం లేదని, భవిష్యత్తులో డ్రైవింగ్ శిక్షణతో పాటు ఆరోగ్య పరీక్షలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.