తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) వెంటనే అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం, 7.1 సౌండ్ సిస్టమ్, 2K లేదా 4K నాణ్యత గల ప్రొజెక్షన్, 75 అడుగుల కంటే పెద్ద స్క్రీన్ ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను ప్రభుత్వం 'స్పెషల్ థియేటర్లు'గా గుర్తించనుంది.

టికెట్ ధరల విషయానికి వస్తే, నాన్-ఏసీ థియేటర్లలో కనిష్ఠంగా ₹30 నుంచి ₹50, గరిష్ఠంగా ₹70 నుంచి ₹100 వరకు వసూలు చేయవచ్చు. ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర ₹50 నుంచి ₹100, గరిష్ఠ ధర ₹150 నుంచి ₹200గా నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లలో టికెట్ ధరలు ₹100 నుంచి ₹300 వరకు ఉండవచ్చు.

మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధర ₹100 నుంచి ₹250గా, రిక్లైనర్ (ఆరామంగా కూర్చునే సీట్లు) ధర ₹200 నుంచి ₹300గా ఉంటుంది. అయితే సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా, మల్టీప్లెక్స్‌లతో సహా ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లను తక్కువ ధర ఉండే నాన్-ప్రీమియం కేటగిరీ కింద కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

థియేటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. అయితే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు విడుదలైనప్పుడు, ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో చిన్న సినిమాలకు కచ్చితంగా ఒక షో కేటాయించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది.

వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో రూపొందిన సినిమాలను 'సూపర్ హై బడ్జెట్' చిత్రాలుగా పరిగణిస్తారు. ఇలాంటి సినిమాలకు విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ వెసులుబాటు కోరుకునే నిర్మాతలు సినిమా కార్మికుల సంక్షేమ నిధికి కోటి రూపాయల వరకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుకింగ్ పద్ధతిలో ఎలాంటి మార్పులు లేవని, పాత పద్ధతిలోనే కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులకు భారం కలగకుండా చూస్తూనే, థియేటర్ యజమానులకు, నిర్మాతలకు మేలు చేసేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.