తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు శనివారం మొదలవుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పండుగ సందర్భంగా మహిళలు, బాలికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పండుగ తెలంగాణ ప్రజల ఉమ్మడి జీవనశైలికి, వారి ఐక్యతకు నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ సంప్రదాయానికి అనుగుణంగా, పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే పూలను దేవతగా కొలిచే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని ఆయన అభివర్ణించారు.
తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ దర్పణంగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. పిల్లాపాపలతో కలిసి ఆడబిడ్డలు ఆటాపాటలతో బతుకమ్మను కొలిచే సంప్రదాయం తెలంగాణ జీవితంలో భాగమైందని ఆయన గుర్తుచేశారు.
తమ హయాంలో బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా కల్పించామని, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చే సంప్రదాయాన్ని అమలు చేశామని కేసీఆర్ వివరించారు. అప్పట్లో మహిళల సంక్షేమం కోసం పలు పటిష్ట కార్యక్రమాలను అమలు చేసినట్లు ఆయన తెలిపారు.
రానున్న తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.








