హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భావన, తనను ఉద్యోగం నుంచి తొలగించడంపై దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. అనారోగ్యం మరియు తన చిన్నారి వైద్య అత్యవసరాల కోసం సెలవు అడిగినందుకు, యాజమాన్యం తనను విధుల్లోంచి తొలగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్య నివేదికలను సమర్పించినప్పటికీ, కంపెనీ యాజమాన్యం తనకు నిరంతరం మెయిల్స్, కాల్స్ చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని భావన తెలిపారు. అంతేకాదు, వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలనే కఠిన నిబంధనలు అక్కడ అమలులో ఉన్నాయని ఆమె ఆరోపించారు. వృత్తి జీవితంలో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇటువంటి కార్పొరేట్ సంస్కృతిని తాను ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు.
ముందస్తు నోటీసు లేదా సరైన వివరణ లేకుండానే తనను తొలగించడంపై న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరారు. ఫిర్యాదు అనంతరం భావన సదరు కంపెనీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.








