వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒక నగల దుకాణంలో చోరీ ఘటన జరిగింది. బుర్ఖాలు ధరించిన ముగ్గురు మహిళలు, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి కస్టమర్ల వలె దుకాణంలోకి ప్రవేశించారు. వీరు సిబ్బందిని వివిధ రకాల నగలు చూపించాలని కోరుతూ వారి దృష్టిని మళ్లించారు.

ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు కౌంటర్‌పై ఉన్న పది గ్రాముల బంగారు గొలుసును చాకచక్యంగా తీసుకుని దాచుకున్నారు. పని పూర్తయ్యాక ఏమీ ఎరగనట్లుగా ఐదుగురు వ్యక్తులు దుకాణం నుంచి బయటకు వెళ్లిపోయారు. నగలను లెక్కించే సమయంలో తేడాను గమనించిన యజమాని, సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.