నీరు, గాలితో కూడిన కఠినమైన యాక్షన్ స్టంట్ చేస్తుండగా జాస్మిన్ భాసిన్ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. ఈ ఘటనలో ఆమె తలకు స్వల్ప గాయం కావడంతో, స్టంట్ పూర్తయిన తర్వాత కొన్ని గంటల పాటు ఏం జరిగిందో ఆమెకు గుర్తుకు రాలేదు. దీంతో హోస్ట్ రోహిత్ శెట్టితో పాటు అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

స్టంట్ తర్వాత రోహిత్ శెట్టిని కలిసినప్పుడు జాస్మిన్ అయోమయంగా కనిపించారు. ఆమెకు ఏం జరిగిందో గుర్తులేదని పదేపదే చెబుతుండటంతో, షోలోని వైద్య బృందం వెంటనే పరీక్షలు నిర్వహించింది. ఆమెకు తాత్కాలిక జ్ఞాపకశక్తి లోపం ఏర్పడిందని గుర్తించిన వైద్యులు, మూడు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఈ ఘటనపై స్పందించిన జాస్మిన్, ఆ స్టంట్ తన జీవితంలో అత్యంత విచిత్రమైన అనుభవమని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ సమయంలో ఏం జరిగిందో తనకు గుర్తులేదని ఆమె చెప్పారు. తనకు తక్షణ వైద్య సహాయం అందించిన రోహిత్ శెట్టికి, షో నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

‘ఖత్రోన్ కే ఖిలాడి 15’ షోలో స్టంట్ల భద్రతపై గత కొన్ని వారాలుగా చర్చ జరుగుతోంది. తొలి వారంలో పెల్లెట్ గన్ టాస్క్, గత వారం పోటీదారుల చేతులపై వేడి మైనం పోసిన స్టంట్లు విమర్శలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు జాస్మిన్ ఘటనతో షోలోని భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.