సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @Mountain4u అనే యూజర్ షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బురద, గడ్డి మధ్య ఉన్న ఒక భారీ రాజనాగు పదేపదే పడగను పైకి లేపడానికి ప్రయత్నిస్తూ, నియంత్రణ కోల్పోయి తూలుతూ కిందపడిపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాము మద్యం తాగిందని భావిస్తూ, “70 రూపాయల దేశీ సరుకు తాగింది”, “నాగపంచమి రోజున పాలకు బదులు లిక్కర్ ఇచ్చారా?” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మనుషులే కాకుండా జంతువులు కూడా మద్యం సేవించడం మొదలుపెట్టాయా అని మరికొందరు చమత్కరిస్తున్నారు.
అయితే, పాము నిజంగానే మద్యం తాగిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాము ఇలా అసాధారణంగా ప్రవర్తించడానికి గాయాలు, ఇతర జంతువులతో జరిగిన పోరాటం, తీవ్రమైన నిర్జలీకరణ (శరీరంలో నీటి శాతం తగ్గడం), విషప్రభావం లేదా నాడీ సంబంధిత సమస్యలు కారణం కావచ్చని చెబుతున్నారు.
ఈ వీడియో ఎక్కడ తీశారు, పాము ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే విషయాలపై ఎటువంటి స్పష్టత లేదు. వీడియోను బట్టి పాము మద్యం తాగిందని నిర్ధారించడం సాధ్యం కాదు. ఏది ఏమైనా, రాజనాగు అసాధారణ ప్రవర్తనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది.








