సినిమా కలెక్షన్ల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్లపై నిర్మాత నాగవంశీ మరోసారి స్పందించారు. ఇండస్ట్రీలో వచ్చే ఏ కలెక్షన్ పోస్టర్ కూడా వాస్తవ సంఖ్యలతో ఉండదని, అవన్నీ ఫేక్ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వంద రూపాయలు వసూలైతే, 110 రూపాయలు వచ్చినట్లుగా పోస్టర్లు వేస్తున్నామని ఆయన వివరించారు.

ఈ పోస్టర్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేవలం అభిమానులను సంతోషపెట్టడమేనని నాగవంశీ తెలిపారు. బుక్ మై షోలో లైకులను కూడా కొనుగోలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇన్ కం ట్యాక్స్ అధికారులకు కూడా ఈ పోస్టర్లలోని నంబర్లు వాస్తవం కావని తెలుసని, అందుకే వాటిని ఆధారంగా చేసుకుని వారు ఆదాయం గురించి ప్రశ్నించరని ఆయన స్పష్టం చేశారు.

గతంలో నిర్మాత దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. హీరోల మధ్య పోటీని పెంచేలా ఫ్యాన్స్ కోరుకోవడం వల్లే నిర్మాతలు ఇలాంటి పోస్టర్లు వేస్తున్నారని, దీనివల్ల సినిమాలపై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతలు స్వయంగా ఈ విషయాన్ని చెబుతున్నా, సోషల్ మీడియాలో అభిమానుల మధ్య కలెక్షన్ల గొడవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.