శ్రీలంక సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఈ వేడుకలు మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగుతాయి. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో నగరం అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. ఈ ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతుంటాయి.

ఈ సంబరాలు మూడు ప్రధాన ఘట్టాలుగా సాగుతాయి. ప్రారంభంలో 'కప్‌ సిటువీమ' అనే క్రతువును నిర్వహిస్తారు. బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న శ్రీ దళదా మాలిగావా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటడం ద్వారా ఈ వేడుకలకు అధికారికంగా శ్రీకారం చుడతారు.

రెండో ఘట్టమైన 'కుంభాల్‌ పెరహెర' పండుగ మొదటి ఐదు రాత్రుల పాటు జరుగుతుంది. ఈ ఊరేగింపులు సంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా సాగుతాయి. ఇందులో కాండియన్‌ నృత్యకారులు, కొరడా ఝళిపించే కళాకారులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.

ఆఖరి ఐదు రాత్రులను 'రాందోళి పెరహెర' లేదా మహా ఊరేగింపులుగా పిలుస్తారు. ఈ సమయంలో కాండీ నగర వీధులు వేలాది మంది భక్తులు, పర్యాటకులతో నిండిపోతాయి. అగ్ని విన్యాసకులు, విద్యుత్ దీపాలతో అలంకరించిన గజరాజులు, వందలాది మంది కళాకారుల ప్రదర్శనలు ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

చివరి రోజు వేకువ జామున 'దహవల్‌ పెరహెర' నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున 'దియా–కెపీమ' అనే జలఖండన కార్యక్రమం జరుగుతుంది. నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించే ఈ క్రతువును వీక్షించడానికి సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు.

శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం ద్వారా దేశానికి సమృద్ధి, వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటారు. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ఈ వేడుకలు ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.