సత్యమంగళం టైగర్ రిజర్వ్ పరిధిలోని తలవాడి, జీరహళ్ళి ఫారెస్ట్ రేంజ్, కమయ్యన్‌పురం ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 62 ఏళ్ల రైతు పసువ చెట్టి తన పసుపు, కూరగాయల పంటలను రక్షించుకునేందుకు ఆదివారం రాత్రి పొలంలోనే కాపలా ఉన్నారు.
ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన ఏనుగు నేరుగా పంట పొలంలోకి ప్రవేశించింది. ఏనుగును చూసిన చెట్టి దానిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా, అది ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఏనుగు తొక్కడంతో చెట్టి అక్కడికక్కడే మరణించారు.
రైతు అరుపులు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు పెద్దగా కేకలు వేస్తూ ఏనుగును తిరిగి అడవిలోకి పంపించగలిగారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు.








