డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి అధ్యక్షతన 2026 ఆగస్టు 25న జరిగింది. టిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
టిమ్స్‌కు ప్రతి రోజూ సగటున 600 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ మంత్రికి వివరించారు. అలాగే డే కేర్ ప్రొసీజర్లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్‌లోని ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్‌తో పాటు ఇతర కీలక వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో స్టెరిలైజేషన్ చేయిస్తున్నామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్జరీలు ప్రారంభిస్తామని డాక్టర్ నరేంద్ర కుమార్ మంత్రికి చెప్పారు.
డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్‌ను అనుసరించనుంది. అదే విధంగా నిమ్స్‌లో అమలులో ఉన్న టారిఫ్‌లను టిమ్స్‌లో కూడా అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నిమ్స్ ఛార్జీలను అమలు చేయడం ద్వారా హాస్పిటల్ ప్రారంభ దశ నుంచే ఒక సమగ్రమైన విధానం అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలోని రెండు ప్రముఖ వైద్య సంస్థల మధ్య చార్జీల విధానంలో ఏకరూపత, మెరుగైన ఆర్థిక ప్రణాళికకు అవకాశం కలుగుతుందని ఈసీ అభిప్రాయపడింది. టిమ్స్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ (TRA) ద్వారా నిర్వహించే విధంగా అవసరమైన బ్యాంకింగ్ సేవలను సమన్వయం చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
టిమ్స్‌లో రోగులు, వైద్యులు, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగుపరిచే ప్రతిపాదనలకు కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. హాస్పిటల్ స్టాఫ్, పేషెంట్లకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయునున్నారు. రోగుల సహాయకుల కోసం అదనపు టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించే ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలిపింది. నిమ్స్ తరహాలోనే మర్రిచెన్నారెడ్డి టిమ్స్‌లోనూ పీజీ కాలేజీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో.. ఇందుకు అనుగుణంగా పీజీ విద్యార్థుల కోసం హాస్టళ్లు నిర్మించే ప్రతిపాదనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను అత్యాధునిక వైద్య సేవలు అందించే సంస్థగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, వైద్య విద్య–పరిశోధనలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ సందర్భంగా తెలిపారు.







