ఆసియా క్రీడ‌లకు ముందే భార‌త మహిళ‌ల హాకీ జ‌ట్టు ప్ర‌తిష్ఠాత్మ‌క ఎఫ్ఐహెచ్ నేష‌న్స్ క‌ప్‌(అంతర్జాతీయ హాకీ సమాఖ్య దేశాల కప్)లో విజేతగా నిలిచింది. ఆక్లాండ్ వేదిక‌గా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో న్యూజిలాండ్‌ను 2-0తో చిత్తు చేసి, భార‌త్ ఈ ట్రోఫీని రెండోసారి కైవసం చేసుకుంది.

ఫైన‌ల్‌లో 4వ నిమిషంలోనే న‌వ‌నీత్ కౌర్ గోల్ కొట్టడంతో భార‌త్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత 15వ నిమిషంలో సునేలిటా టొప్పో మరో గోల్ సాధించడంతో టీమిండియా ఆధిప‌త్యం స్పష్టమైంది. ఖాతా తెరిచేందుకు న్యూజిలాండ్ జ‌ట్టు ఎంత ప్ర‌య‌త్నించినా, భార‌త డిఫెండ‌ర్లు ఏమాత్రం అవ‌కాశ‌మివ్వలేదు.

ఈ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించిన ఫార్వ‌ర్డ్ ల‌ల్రేమ్సియామిని 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపిక చేశారు. మొత్తం టోర్నమెంట్‌లో గొప్ప ప్రదర్శన చేసిన దీపిక, ఆరు గోల్స్ సాధించి అమెరికా ప్లేయ‌ర్ అష్లే సెస్సాతో కలిసి 'ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును పంచుకుంది.

ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన హాకీ ఇండియా, ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ ప్రదర్శనపై ఆయన అభినందనలకు జట్టు గౌరవిస్తుందని, భార‌త్‌ను మరింత గర్వపడేలా చేయడానికి కృషి కొనసాగిస్తుందని పేర్కొంది.