భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల కోసం అత్యధికంగా ఉపయోగిస్తున్న UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశంపై చర్చ జరుగుతోంది. డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారి తరఫున బ్యాంకు లేదా చెల్లింపు సంస్థకు చెల్లించే రుసుమునే MDR అంటారు. ప్రస్తుతం UPI వ్యాపార లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతున్నప్పటికీ, భవిష్యత్తులో రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.3% నుంచి 0.5% మధ్య రుసుము విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ ప్రతిపాదిత నిబంధనలు కేవలం వ్యాపార సంస్థలకు చేసే చెల్లింపులకు మాత్రమే పరిమితం కానున్నాయి. ఒక వ్యక్తి మరో వ్యక్తికి పంపే పర్సనల్ (P2P) లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించవు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు చేసే నగదు బదిలీలు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయి. చిన్న వ్యాపారాలు, రోజువారీ అవసరాలైన పాలు, కూరగాయలు, కిరాణా సామగ్రి కొనుగోళ్లు, ఆటో లేదా క్యాబ్ ఛార్జీల వంటి చిన్న మొత్తాల లావాదేవీలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
జూలై నెలలో జరిగిన మొత్తం UPI లావాదేవీలలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైనవి 4 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో ఇవి 67 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ పెద్ద విలువైన వ్యాపార లావాదేవీలపై పరిమిత MDR విధించడం ద్వారా బ్యాంకులు, చెల్లింపు సంస్థలకు ఆదాయ మార్గం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విధానంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
మున్ముందు ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చినా, ఆ భారాన్ని వ్యాపారులే భరించేలా చూసి సామాన్య వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తుది రుసుము, పరిమితి మరియు ఎవరికి వర్తించాలనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.








