రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ఆగస్ట్ 3న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు ఆగస్ట్ 5న ముగియనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ దేశ ఆర్థిక స్థితిగతులు, ద్రవ్యోల్బణంపై చర్చించి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది.
అంతర్జాతీయ పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు, రిటైల్ ద్రవ్యోల్బణం సవాళ్లు, దేశంలోని వాతావరణ పరిస్థితులు మరియు ఎన్‌నివో ప్రభావాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ అంశాల నేపథ్యంలో రెపో రేటును ప్రస్తుతమున్న 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నిర్ణయం వల్ల రుణాలు తీసుకున్న వారికి, ప్రతి నెలా ఈఎంఐ చెల్లిస్తున్న వారికి ఊరట లభించనుంది. ఒకవేళ రెపో రేటు పెరిగితే ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉండేది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు అవకాశం లేదని సమాచారం. గత నెలలో జరిగిన సమావేశంలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
మరోవైపు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి ఆర్బీఐ సవరించింది. అలాగే, జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత వడ్డీ రేట్లపై తుది నిర్ణయం వెలువడనుంది.








