భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారంనాడు మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను, ఆయన వ్యక్తిగత సందేశాన్ని పుతిన్‌కు జైశంకర్ అందజేశారు. రెండ్రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఆదివారంనాడు మాస్కో చేరుకున్న జైశంకర్.. పుతిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ పరిణామాలపై చర్చించారు. సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగే బ్రిక్స్ దేశాల నేతల సదస్సు కోసం పుతిన్ న్యూఢిల్లీకి రానున్న నేపథ్యంలో జైశంకర్-పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీలో జైశంకర్ మాట్లాడుతూ, భారత్-రష్యా మధ్య సహకారం బలంగా ఉందని అన్నారు. వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, అణు సహకారం తదితర రంగాల్లో ఆర్థిక సంబంధాలు గణనీయంగా పెరుగుతున్నాయని వివరించారు. ఎస్‌సీఓ సదస్సులో పుతిన్‌ను కలిసేందుకు ప్రధాని మోదీ ఎదురుచూస్తున్నారని, అనంతరం బ్రిక్స్ సదస్సు కోసం ఆయనను భారత్‌కు స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారని జైశంకర్ చెప్పారు. ఇరుదేశాల నేతల పరస్పర సౌలభ్యం మేరకు వార్షిక సదస్సును కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు.
దీనికి ముందు జైశంకర్ రష్యా ప్రథమ ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం మరింత విస్తరించే మార్గాలపై ఉభయులు చర్చించారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులు ఉన్నప్పటికీ పరస్పర ప్రయోజనాలు, నమ్మకంపై ఆధారపడిన రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతూ వచ్చిందని మంటురావోతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు. రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కూడా జైశంకర్ సమావేశం కానున్నారు.








