పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు నిర్వహించిన సోదాలు తీవ్ర కలకలం రేపాయి. గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక ఎన్‌ఐఎ బృందం, స్థానిక పోలీసుల సహకారంతో ఓ విద్యార్థి ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. టెలిగ్రామ్ గ్రూప్‌లోని కొన్ని అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలు, నెట్‌వర్క్‌లతో సంబంధం ఉందన్న ప్రచారంతో సోదాలు చేసినట్లు సమాచారం. రామగుండానికి చెందిన విద్యార్థి ప్రస్తుతం పెద్దపల్లిలోని ఓ కళాశాలలో డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. అతడి డిజిటల్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్‌ఐఎ అధికారులు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదరు టెలిగ్రామ్ ఖాతాలోని నెట్‌వర్క్, ఆన్‌లైన్ సంభాషణలు, ఇతర సభ్యులతో యువకుడికి ఉన్న సంబంధాలపై ప్రశ్నించినట్లు సమాచారం.
న్యాయస్థానం నుంచి ముందస్తు అనుమతి పొందిన అనంతరమే గుజరాత్ ఎన్‌ఐఎ అధికారులు రామగుండంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏ కేసు నిమిత్తం దర్యాప్తు చేపట్టారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లోని డేటాను సాంకేతిక నిపుణులు విశ్లేషించ నున్నారు. అవసరమైన సమయంలో విచారణకు హాజరుకావాలని విద్యార్థిని అధికారులు ఆదేశించారు. ఈ వ్యవహారంలో అతడికి నేరపూరిత ప్రమేయం ఉన్నట్లు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఆన్‌లైన్ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఏదైనా సైబర్ నేరం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగాయా? గుజరాత్ కేసుతో ఇక్కడి యువకుడికి ఉన్న లింకు ఏమిటనే ప్రశ్నలపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు సంస్థ నుంచి ప్రకటన వెలువడితేనే నిజాలు బయటకు రానున్నాయి.
సైబర్ దాడులకు పాల్పడిన ఉగ్రమూకల ఏరివేతలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దూకుడు పెంచింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసులో భాగంగా... దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో NIA ఏకకాలంలో సంచలన సోదాలు నిర్వహించింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
ముఖ్యంగా తెలంగాణలోని రామగుండంలో అనుమానితుల నివాసాల్లో NIA అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ డివైసులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లతో పాటు పలు పెన్‌డ్రైవ్‌లను సీజ్ చేశారు. సైబర్ దాడులకు పాల్పడిన వ్యక్తుల సాంకేతిక విశ్లేషణ ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్' సమయంలో దేశంలోని 54 కీలక ప్రభుత్వ వెబ్‌సైట్లపై 'డీడీఓఎస్ దాడులకు యత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ కీలక కంప్యూటర్ వనరులు, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ సైబర్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. మొదట గుజరాత్ ATS నమోదు చేసిన ఈ కేసును, ఆ తర్వాత తీవ్రత దృష్ట్యా NIA తన చేతుల్లోకి తీసుకుంది. 2025 జూన్ 25న RC-01/2025/NIA/AMD నంబర్‌తో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ సైబర్ టెర్రరిజం నెట్‌వర్క్‌లో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా... తాజాగా సోదాలు జరిపిన అనుమానితులకు వారితో ఉన్న సంబంధాలపై NIA అధికారులు లోతుగా విచారిస్తున్నారు.








