విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, భారత్ పూర్తిగా స్వదేశీ ముడి పదార్థాలతోనే AK-203 రైఫిల్‌ను తయారు చేసింది. 'షేర్' అని పేరు పెట్టిన ఈ రైఫిల్, ఆటోమేటిక్ మరియు బరస్ట్ ఫైరింగ్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2019లో భారత్, రష్యా దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) అనే సంస్థను ఏర్పాటు చేశారు.
గతంలో ఈ రైఫిళ్ల తయారీకి విదేశాల నుంచి కిట్‌లను దిగుమతి చేసుకునేవారు. అయితే, ఇప్పుడు ప్రతి విడిభాగం, ముడి పదార్థం భారత్‌లోనే తయారవుతోంది. సుమారు 50 ప్రధాన భాగాలు, 180 ఉప భాగాలతో కూడిన ఈ రైఫిల్ తయారీ ప్రక్రియలో 120 దశలు ఉన్నాయి. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తయారు చేసేందుకు IRRPL అనేక దేశీయ సరఫరాదారులను సిద్ధం చేసింది.
AK-203 అనేది 7.62×39 మిమీ కార్ట్రిడ్జ్ (తుపాకీలో వాడే మందుగుండు గుళిక) ఉపయోగించే గ్యాస్-ఆపరేటెడ్, మ్యాగజైన్-ఫెడ్ అసాల్ట్ రైఫిల్. ఇందులో ఫోల్డింగ్ స్టాక్, ఆధునిక ఆప్టికల్ పరికరాలను అమర్చే రైల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత సైన్యం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మొత్తం 6,01,427 రైఫిళ్లను తయారు చేసేందుకు రూ. 5,200 కోట్ల ఒప్పందం కుదిరింది. ఉత్పత్తి గడువును అక్టోబర్ 2032 నుంచి డిసెంబర్ 2030కు ప్రభుత్వం ముందుకు జరిపింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోర్వా ప్లాంట్ ప్రతి రోజు 600 రైఫిళ్లను, అంటే ప్రతి 100 సెకన్లకు ఒక రైఫిల్‌ను తయారు చేయాల్సి ఉంటుంది.
ఈ రైఫిళ్లలో దేశీయ వస్తువుల వాటా 2025 మధ్య నాటికి 50 శాతం ఉండగా, అది ఇప్పుడు 100 శాతానికి చేరుకుంది. త్వరలో భారత సైన్యం ఈ రైఫిళ్లపై యూజర్ ట్రయల్స్ (వినియోగదారుల పరీక్షలు) నిర్వహించనుంది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ రైఫిళ్లను సైన్యానికి అందజేసి పూర్తిస్థాయి పరీక్షలు చేసే అవకాశం ఉంది.







