కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి పట్టణంలో సుభాష్ అనే వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా, అంబేడ్కర్ కూడలి వద్ద ఉన్న ఏఐ కెమెరా ఆయన వాహనాన్ని గుర్తించింది. ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా హెల్మెట్ ధరించలేదనే కారణంతో ఆయన వాట్సాప్ నంబర్‌కు రూ.500 జరిమానా విధిస్తూ చలాన్ పంపింది.
కారు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని జరిమానా రావడంతో సుభాష్ ఆశ్చర్యపోయారు. ఈ నిబంధనపై స్పష్టత కోసం ఆయన స్వయంగా హెల్మెట్ ధరించి, కారు నడుపుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కారులో ప్రయాణించేటప్పుడు కూడా హెల్మెట్ తప్పనిసరా అని పోలీసులను ప్రశ్నించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సుభాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐ కెమెరా ఆటోమేటెడ్ సిస్టమ్ చేసిన పొరపాటు వల్లే ఈ జరిమానా జారీ అయిందని పోలీసులు గుర్తించారు. దీంతో సుభాష్‌కు విధించిన రూ.500 జరిమానాను అధికారులు రద్దు చేశారు.
సాధారణంగా ద్విచక్ర వాహనదారులకు మాత్రమే హెల్మెట్ నిబంధన వర్తిస్తుంది. అయితే, కారు నంబర్‌ను గుర్తించిన ఏఐ వ్యవస్థ పొరపాటున హెల్మెట్ నిబంధనను వర్తింపజేయడం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది.








