ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్‌లలో వీసా అపాయింట్‌మెంట్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే షెడ్యూల్ అయిన కొన్ని వీసా ఇంటర్వ్యూలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఇంటర్వ్యూ తేదీలను తర్వాత వెల్లడిస్తామని దరఖాస్తుదారులకు సమాచారం అందించింది.

ఈ నిర్ణయం వెనుక వీసా నిబంధనల్లో తక్షణ మార్పులు ఏమీ లేవని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం కోసమే ఈ అపాయింట్‌మెంట్లను సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తుదారుల వ్యక్తిగత నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమెరికా ప్రభుత్వ సహాయంపై ఆధారపడే అవకాశాలను లోతుగా పరిశీలించేలా అధికారులకు శిక్షణ ఇస్తున్నారు.

ఈ శిక్షణ తర్వాత వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. దీనివల్ల వీసా తిరస్కరణలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ సేవలు తిరిగి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయనే దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి గడువు ప్రకటించలేదు.

ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే H-1B వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచింది. అలాగే, ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికాను వీడాలనే నిబంధనను కూడా అమలు చేస్తోంది. జాతీయ భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు, వలస విధానాలపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చట్టపరమైన అడ్డంకులను కూడా ఎదుర్కొంటున్నాయి. గతంలో 75 దేశాల దరఖాస్తుదారులపై విధించిన వలస వీసాల నిషేధాన్ని కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా కొత్త నిబంధనలను తీసుకువస్తూ వీసా ప్రక్రియను కఠినతరం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం కొనసాగిస్తోంది.