ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆరో పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 11-21, 21-15, 17-21 స్కోరుతో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యి చేతిలో ఓడిపోయింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ పోరులో సింధు వరుస తప్పిదాలు చేయడంతో ప్రత్యర్థికి అవకాశం దక్కింది. కెరీర్‌లో 11వ సారి ఈ టోర్నీలో ఆడుతున్న సింధుకు, వాంగ్ జి యి చేతిలో ఇది ఆరో ఓటమి.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ ఆయుష్ శెట్టి కూడా ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. ఇండోనేషియాకు చెందిన అల్వీ ఫర్హాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ 19-21, 11-21 స్కోరుతో వరుస గేమ్స్‌లో ఓడిపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ కూడా చైనా జంట చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

భారత డబుల్స్ జోడీలు మాత్రం పతక ఆశలను సజీవంగా ఉంచాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్-యాప్ రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 స్కోరుతో థ్రిల్లింగ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత జోడీ అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించింది.

మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ జపాన్ జంట రిన్ ఇవానాగా-కీ నకానిషిని 21-16, 21-12 స్కోరుతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ట్రీసా, గాయత్రితో కలిసి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 2015 తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్ చేరిన భారత మహిళా డబుల్స్ జోడీగా వీరు నిలిచారు.

సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుల ప్రయాణం ముగియగా, ఇప్పుడు అందరి దృష్టి డబుల్స్ జంటల ప్రదర్శనపైనే ఉంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో గెలిచి పతకాలను ఖాయం చేసుకోవాలని సాత్విక్-చిరాగ్, గాయత్రి-ట్రీసా జాలీలు సిద్ధమవుతున్నారు.