ఖమ్మం, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. ప్రజలకు సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో నగరంలోని ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ జోనల్ కార్యాలయాలు, కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. న్యూ మున్సిపల్ కార్యాలయం, బల్లేపల్లి నార్త్ జోనల్ కార్యాలయం, ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం, జమలాపురం కేశవరావు పార్క్, మమత రోడ్ కేంద్రాల్లో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
డ్రైనేజీ, పారిశుధ్యం, ఆస్తి అసెస్‌మెంట్, టౌన్ ప్లానింగ్, కుక్కల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. 15వ డివిజన్ కవిరాజ్‌నగర్‌కు చెందిన ఆర్.శంకర్ కొత్త డ్రైనేజీ నిర్మాణంతోపాటు పాత ఆర్‌అండ్‌బీ కార్యాలయం వెనుక పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు. రాపర్తినగర్‌కు చెందిన షేక్ జాఫర్ హుస్సేన్ టౌన్ ప్లానింగ్ సమస్యపై అర్జీ ఇచ్చారు. చెరువుబజార్‌కు చెందిన షేక్ హమీద్ కొత్త డ్రైనేజీ నిర్మించాలని కోరారు. 19వ డివిజన్ కొత్తగూడెంకు చెందిన కె.తిరుమలరావు, టి.నవీన్‌కుమార్ ఆస్తి అసెస్‌మెంట్ సమస్యలపై ఫిర్యాదు చేశారు. 11వ డివిజన్ లెనిన్‌నగర్‌కు చెందిన ఎ.సునీతాబాయి కుక్కల బెడదను పరిష్కరించాలని కోరారు.
ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతోందని, అందిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపేలా నగరపాలక సంస్థ చర్యలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.








