సాధారణంగా బీమా పాలసీలు తీసుకోవాలంటే ఏటా భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సామాన్యులకు కూడా ప్రమాద బీమా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY)ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా అంగవైకల్యానికి గురైనా రూ.2 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రమాదం వల్ల పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.1 లక్ష వరకు పరిహారం అందుతుంది.
ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దీని కోసం యాక్టివ్ బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నా, ఏదో ఒక ఖాతా ద్వారా మాత్రమే ఈ బీమా పొందడానికి అవకాశం ఉంది. ప్రతి ఏడాది జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ బీమా కాలం ఉంటుంది. జూన్ 1న లేదా అంతకంటే ముందే బ్యాంకు ఖాతా నుంచి రూ.20 ప్రీమియం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది కాబట్టి, ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పథకం మొదలైనప్పటి నుంచి 2024 మే వరకు మొత్తం 1,80,812 క్లెయిమ్‌లు రాగా, అందులో 1,37,404 క్లెయిమ్‌లను ప్రభుత్వం పరిష్కరించింది. ఇందుకోసం రూ.2,728.85 కోట్ల బీమా మొత్తాన్ని చెల్లించింది. 2024 జూన్ నుంచి 2025 ఏప్రిల్ 16 మధ్య కాలంలోనే కొత్తగా 36.86 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. ఇదే సమయంలో 33,906 క్లెయిమ్‌లలో 19,024 క్లెయిమ్‌లను పరిష్కరించి, రూ.377.73 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఈ పథకానికి ప్రతి ఏడాది పునరుద్ధరణ అవసరం. అయితే, బీమా కవరేజీ, అర్హతలు, క్లెయిమ్ నిబంధనలు మరియు ప్రీమియం వంటి వివరాలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కాబట్టి, ఈ పథకంలో చేరే ముందు మీ బ్యాంకును సంప్రదించడం లేదా అధికారిక ప్రభుత్వ వనరుల ద్వారా తాజా నిబంధనలను తెలుసుకోవడం మంచిది.







