కర్నూలు రూరల్ బ్యూరో ఆంధ్రప్రభ : ఫ్లోరైడ్‌ కారక నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్‌ వ్యాధి బారినపడే అవకాశం ఉందని ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. మంగళవారం ఉల్లిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఓబులాపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఫ్లోరోసిస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ… ఫ్లోరోసిస్‌ ప్రభావంతో దంతాలపై అడ్డంగా పసుపు రంగు గీతలు ఏర్పడటం, దంతాలు చాక్‌పీసు రంగులోకి మారడం, గుంటలు ఏర్పడటం, చిగుళ్లు నల్లగా మారడం, పిప్పి పళ్లుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. వ్యాధి తీవ్రత పెరిగితే కాళ్లు, చేతులు వంకరలు పోవడం, దొడ్డికాళ్లు ఏర్పడటం, మెడ, వెన్నెముక భాగాలు గట్టిపడి సహజమైన కదలికను కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఫ్లోరోసిస్‌ జీర్ణవ్యవస్థపైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

ఫ్లోరోసిస్‌ను నివారించేందుకు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కాల్షియం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, నువ్వులు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెప్పారు. విటమిన్‌-సి అధికంగా ఉండే ఉసిరి, జామ, నారింజ, ద్రాక్ష, టమాటాలను తీసుకోవాలని సూచించారు. జింక్‌ లభించే పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, పుట్టగొడుగులు, గుమ్మడికాయ వంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలను అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండారెడ్డి, రమణరెడ్డి, సచివాలయ ఆరోగ్య కార్యకర్త నయోమి, ప్రొజెక్షనిస్ట్‌ ఖలీల్‌ పాల్గొన్నారు.