పార్టీకి సంబంధం లేని వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోంది. పార్టీ గీత దాటి ఎవరూ మాట్లాడకూడదని, అలా చేస్తే సహించేది లేదని పీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి ఆవేదనను తాము అర్థం చేసుకున్నప్పటికీ, బహిరంగ విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి తనకు మంచి మిత్రుడే అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రభుత్వ ప్రధాన నిర్ణయాల్లో పార్టీకి కూడా పాత్ర ఉంటుందని ఆయన వివరించారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో 60 శాతం పాత వారికి, 40 శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రం అప్పుల పాలు కావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే కారణమని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2018 నుంచి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అందరినీ ఒకేసారి సంతృప్తి పరచడం రాష్ట్ర అప్పుల వల్ల సాధ్యం కావడం లేదని ఆయన వివరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, తప్పుడు కథనాలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.








