వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత వారం పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌‌తో మాట్లాడినట్లు రాయిటర్స్‌ వెల్లడించింది. ఇరాన్‌తో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, పాకిస్థాన్‌ తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్‌ను మళ్లీ అమెరికాతో చర్చల టేబుల్‌ వద్దకు తీసుకురావాలని ట్రంప్‌ కోరినట్లు పాకిస్థాన్‌కు చెందిన 3 వర్గాలు తెలిపాయి.

ట్రంప్‌ ప్రారంభించిన ఈ ఫోన్‌ సంభాషణ మునీర్‌ ఇరాన్‌ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగింది. అయితే ఆ సంభాషణలోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. వైట్‌హౌస్‌ కూడా దీనిపై స్పందించలేదు.

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మునీర్‌ సోమవారం టెహ్రాన్‌ చేరుకున్నారు. ఆయనతో పాటు పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్‌ నఖ్వీ కూడా వెళ్లారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పర్యటన లక్ష్యమని పాకిస్థాన్‌ సైన్యం తెలిపింది.

ఇరాన్‌ గల్ఫ్‌ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకునే చర్యలకు దిగుతామని హెచ్చరిస్తుండగా, ఇరాన్‌కు ఆర్థికంగా సహకరించే దేశాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ అమెరికా-ఇరాన్‌ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించింది. గతంలోనూ పాకిస్థాన్‌ ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరించి జూన్‌లో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంలో పాత్ర పోషించింది. అయితే ఆ ఒప్పందం తర్వాత విఫలమైంది.

ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ట్రంప్‌ కోరుతున్నారు. అందుకోసం ఇరాన్‌పై ప్రభావం ఉన్న పాకిస్థాన్‌ను రంగంలోకి దించి, అసిమ్‌ మునీర్‌ ద్వారా టెహ్రాన్‌ను చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.