బాంబులు, పేలుడు పదార్థాలు లేదా అక్రమ ఆయుధాల తయారీ విధానాలను గూగుల్‌లో వెతకడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇటువంటి చట్టవిరుద్ధమైన సమాచారం కోసం శోధించిన వారిపై భద్రతా సంస్థల దృష్టి పడే అవకాశం ఉంది, పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించే ప్రమాదం ఉంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన వివరాలు వెతకినా ఇదే పరిస్థితి ఎదురవచ్చు.

అదేవిధంగా ఫోన్లు, వై-ఫై నెట్‌వర్క్‌లు లేదా బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేయడం, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లను ఛేదించే పద్ధతులపై ఆరా తీయడం కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ రకమైన శోధనలు చేసే వ్యక్తులను అధికారులు అనుమానాస్పదంగా భావించి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఆర్థిక పరంగానూ జాగ్రత్త అవసరం. తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందని హామీ ఇచ్చే వెబ్‌సైట్లు, పెట్టుబడి పథకాలు మోసపూరితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నెట్‌లో దొరికే నకిలీ కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేస్తే, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

ఆరోగ్య విషయంలోనూ స్వయం చికిత్స ప్రమాదకరం. లక్షణాలను చూసి గూగుల్‌లో మందులు వెతికి వాడకుండా, అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. విశ్వసనీయ వనరులు, అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారా మాత్రమే సమాచారం సేకరించి, సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.