నల్లగొండ సిటీ, జూన్ 23 : టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ మంగళవారం నల్లగొండ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్‌లో జిల్లా స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ సర్కిల్‌కు సంబంధించిన టీ-కోడ్ వారీ అంచనాలు, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, అమలు పరిస్థితులు అలాగే పెండింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించారు. కాలిపోయిన, పనిచేయడం నిలిచిపోయిన (స్టక్-అప్) విద్యుత్ మీటర్లను త్వరితగతిన మార్చడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే చర్యలను వేగవంతం చేయాలని సీఎండీ ఆదేశించారు.
2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పూర్తికాని పనుల పురోగతి, వాటి పూర్తి కోసం అవసరమైన మెటీరియల్, నిధులు, ఇతర అవసరాలపై సమీక్షించారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త అంచనాలు, బడ్జెట్ ఇండెంట్లు, ప్రతిపాదిత పనులపై చర్చించారు. విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి అవసరమైన కండక్టర్లు, కేబుళ్లు, విద్యుత్ స్తంభాలు, ఇంటర్మీడియట్ పోల్స్ ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ప్లింత్ రైజింగ్ తదితర పనులకు అవసరమైన సామగ్రి అవసరాలను అధికారులు వివరించారు.
వర్షాకాల సన్నద్ధత, విద్యుత్ అంతరాయాల నివారణ చర్యలు, ఫీడర్ల నిర్వహణ, ట్రీ ట్రిమ్మింగ్ కార్యక్రమాలు, వ్యవసాయ విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు, వినియోగదారుల సేవల మెరుగుదలపై సమగ్రంగా చర్చించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మాన్సూన్ కాలంలో విద్యుత్ వ్యవస్థ సజావుగా పనిచేసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్.నరసింహులు, చీఫ్ ఇంజనీర్ (రూరల్ జోన్) బాలస్వామి, ఎస్‌ఈ (ఆపరేషన్స్) వెంకటేశ్వర్లు, నల్లగొండ సర్కిల్ పరిధిలోని 33 మండలాలు, 5 మున్సిపాలిటీలకు చెందిన డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఏఏఈలు, జేఏఓలు, ఎస్‌ఏఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








