చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా హిందీ వివాదం, నీట్, కరూర్ తొక్కిసలాట ఘటన వంటి పలు అంశాలు ప్రస్తావించిన విజయ్ విమర్శకులకు గట్టిగా బదులిచ్చారు. ఎన్నో సవాళ్లను దాటి తాము అధికారం లోకి వచ్చామని, నటుడి పార్టీ అని తమను ఎంతోమంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు.
“మాకు ఈ అధికారం అంత సులువుగా వచ్చింది కాదు. తమిళనాడు ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు నేను, నా పార్టీ ఎన్నో కుట్రలు, సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. మాది యాక్టర్ పార్టీ అని, నేను సినిమా షూటింగ్ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నానని చాలా మంది రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తారు. కానీ నేను ప్రజల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశా. నాపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారు” అని విజయ్ అన్నారు.
ఈ సందర్భంగా నీట్ వివాదం గురించి విజయ్ సభలో ప్రసంగించారు. నీట్ విధానం విద్యావ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నట్టు సిఎం పునరుద్ఘాటించారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు. ప్రసంగంలో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనను విజయ్ ప్రస్తావించారు.
“41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద సంఘటన నన్ను ఎంత వేదనకు గురి చేసిందో మాటల్లో చెప్పలేను. ఆ బాధ నన్ను ఎన్నటికీ వదలదు. ఆ సంఘటన విషయం లోనూ మాపైనే నిందలేశారు. ఇది అత్యంత దారుణం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా? అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారసత్వ రాజకీయాల గురించి స్పందిస్తూ డీఎంకేపై విజయ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. “ కేవలం ఒక కుటుంబానికే (డీఎంకేను ఉద్దేశిస్తూ) ప్రాధాన్యమివ్వడం మా రాజకీయ విధానం కాదు. తమిళనాడు లోని ప్రతి కుటుంబానికి మా సేవలందిస్తాం . అదే మా రాజకీయం. అదే మా పాలనా విధానం ” అని విజయ్ పేర్కొన్నారు.








