కటక్ జిల్లా గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల సుమన్ అనే బాలుడు పొలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాలువ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అడవి పంది ఒక్కసారిగా బాలుడిపైకి దూసుకొచ్చింది.

పంది నుంచి తప్పించుకునేందుకు సుమన్ వెంటనే పక్కనే ఉన్న కాలువలోకి దూకాడు. అయితే బాలుడిని వెంబడిస్తూ ఆ పంది కూడా కాలువలోకి దూకడంతో, సుమన్ ఆ పంది నోటిని గట్టిగా పట్టుకున్నాడు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు బాలుడు తన శక్తిని అంతా ఉపయోగించి రెండు గంటల పాటు పందితో పోరాడాడు.

అటుగా వెళ్తున్న స్థానికులు నీటిలో పందిని పట్టుకుని ఉన్న సుమన్‌ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారుల సహాయంతో ఆ అడవి పందిని బంధించారు.

ఈ పోరాటంలో గాయపడిన సుమన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. బాలుడు పందితో పోరాడుతున్న దృశ్యాలను స్థానికులు ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టగా, ఆ వీడియో ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించింది.