ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధను సొమ్ము చేసుకునేందుకు మార్కెట్ శక్తులు తక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారాలను 'సూపర్ ఫుడ్'ల పేరుతో ప్రచారం చేస్తున్నాయి. ఫిట్‌నెస్ ప్రియులు మొదలుకుని ఆరోగ్య స్పృహ ఉన్నవారందరూ ప్రొటీన్ ఎక్కువగా ఉండే పదార్థాల వైపు చూస్తుండటంతో, కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. దీంతో ప్రొటీన్ విషయంలో ఉన్న అపోహలు, వాస్తవాల మధ్య తేడాను అర్థం చేసుకోవడం అత్యవసరమైంది.
శాకాహారం వల్ల కండరాలు పెరగవని, అది ఆరోగ్యానికి పెద్దగా దోహదపడదని కొందరు భావిస్తుంటారు. కానీ ధాన్యాలు, పప్పుధాన్యాలు, గింజలు, విత్తనాలను కలిపి లేదా మార్చి మార్చి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని రకాల అమైనో ఆమ్లాలను పొందవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే కేవలం ప్రొటీన్ తీసుకుంటేనే కండరాలు పెరుగుతాయని అనుకోవడం కూడా తప్పు. కండరాల నిర్మాణానికి, మరమ్మతుకు ప్రొటీన్ అవసరమే కానీ, దానికి తగినంత కేలరీలు, వ్యాయామం కూడా అనివార్యం.
భోజనంలో శరీరం కేవలం 30 గ్రాముల ప్రొటీన్ మాత్రమే గ్రహిస్తుందనే అభిప్రాయం కూడా నిజం కాదు. మనిషి తీసుకున్న ప్రొటీన్ అంతటినీ శరీరం గ్రహిస్తుంది. కండరాల నిర్మాణానికి 30 నుంచి 40 గ్రాముల పరిమితి ఉండగా, మిగిలిన ప్రొటీన్ శరీర క్రియలు, కణజాల రక్షణ, శక్తి కోసం వినియోగమవుతుంది. మరోవైపు రోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే సరిపోతుందని, పీనట్ బటర్ లేదా చియా విత్తనాలతో ప్రొటీన్ లోటు తీరుతుందని నమ్మడం కూడా పొరపాటే. వంద గ్రాముల బాదంలో 21 గ్రాముల ప్రొటీన్ ఉన్నా, అందులో 50 గ్రాముల కొవ్వు, 570 కేలరీలు కూడా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్‌లో కేవలం 3.5 నుంచి 4 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అలాగే చియా విత్తనాల్లో ప్రొటీన్ కంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు ఎక్కువగా ఉంటాయి.
బ్రోకలీలో మాంసం కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుందని, వరి అన్నం బదులు క్వినోవా తినడం వల్ల ఎక్కువ ప్రొటీన్ అందుతుందని ప్రచారం చేయడం కూడా వాస్తవాలకు దూరం. 30 గ్రాముల ప్రొటీన్ కోసం రోజుకు కిలోకు పైగా బ్రోకలీ తినాల్సి వస్తుంది. క్వినోవాలో ప్రొటీన్ ఉన్నా అది ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆహారమే. వంద గ్రాముల క్వినోవా అన్నంలో 4.4 గ్రాముల ప్రొటీన్ ఉంటే, 21 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. నిజానికి వంద గ్రాముల చికెన్ ఛాతీలో 31 గ్రాములు, పనీర్‌లో 18 నుంచి 23 గ్రాములు, ఎండిన సోయా ముక్కల్లో 52 గ్రాముల ప్రొటీన్ ఉంటాయి.
మార్కెట్ మాయాజాలంలో పడకుండా ఉండాలంటే, తమ వయసు, శరీర తీరు, దైనందిన కార్యకలాపాల ఆధారంగా ఆహారాన్ని ఎంచుకోవాలి. కొవ్వు లేని మాంసం, చేపలు, గుడ్లు, పనీర్, టోఫు, సోయా తగిన పాళ్లలో తీసుకోవాలి. అలాగే గింజలు, కాయధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో సమతుల్య ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన కొవ్వులు, సమగ్ర కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.







