సముద్రంలో ఈదుతున్న వ్యక్తిని ఆక్టోపస్ గట్టిగా పట్టుకున్న ఘటన ఇటీవల చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి దాని నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, ఆక్టోపస్ పట్టు వదలలేదు. చివరకు దాన్ని తొలగించేందుకు అతను గుద్దులు గుద్దాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్టోపస్ మనుషులను ఎందుకు పట్టుకుంటుంది, ఒకవేళ అంటుకుంటే ఏం చేయాలనే అంశాలపై నిపుణులు స్పష్టత ఇచ్చారు.

నిపుణుల ప్రకారం, ఆక్టోపస్ మనుషులను వేటాడదు. తన చుట్టూ ఉన్న వస్తువులను తాకి అర్థం చేసుకునే క్రమంలో ఆసక్తితో మనిషిని పట్టుకుంటుంది. ఆక్టోపస్‌కు ఉండే ఎనిమిది భుజాలపై గాలి లేదా నీటి ఒత్తిడితో పనిచేసే సక్షన్ కప్‌లు ఉంటాయి. ఒక పెద్ద ఆక్టోపస్ శరీరంపై ఇలాంటివి 2,000కు పైగా ఉండటం వల్ల, దాని పట్టు చాలా బలంగా ఉంటుంది. అందుకే దాని నుంచి బయటపడటం సాధారణంగా కష్టమవుతుంది.

ఆక్టోపస్ అంటుకున్నప్పుడు భయపడకుండా ఉండటం చాలా ముఖ్యం. బలంగా లాగితే దాని పట్టు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. కాబట్టి, దాని భుజాల అంచులను నెమ్మదిగా విడదీయడానికి ప్రయత్నించాలి. సమీపంలో లైఫ్‌గార్డ్ ఉంటే వారి సహాయం తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఆక్టోపస్ నీటి బయట శరీరానికి అంటుకుని ఉంటే, ఆ భాగాన్ని వెంటనే నీటిలోకి తీసుకెళ్లాలి. నీరు తగిలిన వెంటనే అది సాధారణంగా ఈదుకుంటూ దూరంగా వెళ్లిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఆక్టోపస్‌ను నెమ్మదిగా వెనక్కి జరిపితే అది స్వయంగా పట్టు వదిలేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా జాతుల ఆక్టోపస్‌లు ఉన్నాయి. ఇవి రంగులు మార్చడం, చిన్న ప్రదేశాల నుంచి బయటపడటం, ప్రమాద సమయంలో సిరా వంటి ద్రవాన్ని విడుదల చేయడం వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. వీటి భుజాలపై ఉండే సక్షన్ కప్‌లు కేవలం పట్టుకోవడానికే కాకుండా, చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించడానికి కూడా ఉపయోగపడతాయి.