కేరళలో 2021లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘స్టీఫెన్’ చిత్రాన్ని రూపొందించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, తొమ్మిది మంది యువతులను దారుణంగా హతమార్చిన స్టీఫెన్ జబరాజ్ అనే సీరియల్ కిల్లర్ నేర ప్రవృత్తిని ఈ సినిమా చూపిస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

మిథున్ బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోమతి శంకర్ సైకో కిల్లర్‌గా నటించగా, మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, కుబేరన్, విజయశ్రీ, అమర రమేష్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 5 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఈ కథలో నిందితుడు పోలీసులకు పట్టుబడకముందే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడం, కోర్టులో నేరాన్ని అంగీకరించడం వంటి అంశాలు ప్రధాన మలుపులుగా ఉంటాయి. స్టీఫెన్ ఎందుకు ఈ దారుణాలకు పాల్పడ్డాడు, అతని గతమేంటి, పోలీసుల విచారణలో ఏం తేలింది అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమాలో చూడవచ్చు.