నవంబర్ 13, 2026న ప్రపంచం అంతమవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. అయితే, ఈ భయాలకు కారణమైన 'డూమ్స్‌డే' (ప్రళయం) అనే పదం భూమి బద్దలవ్వడం లేదా గ్రహశకలాలు పడటం వంటి వినాశనాన్ని సూచించదు.

ఈ ప్రచారానికి మూలం 1960లో ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త హెంజ్ ఫోర్స్టర్, ఆయన సహచరులు పాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమియోట్‌లు ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం. ఆ కాలంలో జనాభా పెరుగుదల రేటును విశ్లేషించి, 2026 నాటికి జనాభా పరిమితి దాటి అనంతానికి చేరుకుంటుందని వారు ఒక గణిత సమీకరణాన్ని రూపొందించారు.

ఫోర్స్టర్ తన అధ్యయనంలో ప్రకృతి వినాశనం గురించి ఎక్కడా చెప్పలేదు. జనాభా విపరీతంగా పెరగడం వల్ల ఆహారం, నీరు వంటి వనరులు సరిపోక ఆకలి చావులు సంభవిస్తాయని మాత్రమే వారు హెచ్చరించారు. అంటే, ఇది గ్రహశకలాల దాడి వంటి ప్రకృతి వైపరీత్యం కాదు.

నిజానికి ప్రపంచం ఫోర్స్టర్ ఊహించిన దిశలో పయనించలేదు. 1963లో 2.2 శాతంగా ఉన్న ప్రపంచ జనాభా వృద్ధి రేటు, ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2026 నాటికి 0.84 శాతానికి పడిపోయింది. విద్య, మహిళా సాధికారత, పట్టణీకరణ మరియు గర్భనిరోధక సాధనాల వాడకం వంటి కారణాల వల్ల జననాల రేటు క్రమంగా తగ్గింది.

ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు చేరినప్పటికీ, అది ఫోర్స్టర్ లెక్కించినట్లుగా అనంతం కావడం లేదు. కాబట్టి, నవంబర్ 13న ప్రపంచానికి ఎలాంటి ముప్పు లేదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.